హైదరాబాద్ : ఉత్తరాంధ్ర కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం గరివిడిలక్ష్మి. ఇది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సినిమాను చూడలేక పోయిన ప్రేక్షకులకు తీపి కబురు చెప్పింది చిత్ర బృందం. నవంబర్ 26 శుక్రవారం నుంచి గరివిడి లక్ష్మి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.. ఇక ఐదు భాషల్లో ఈ సినిమాను ఇంటి నుంచే వీక్షించవచ్చు.
గరివిడి లక్ష్మి కథ విషయానికి వస్తే ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద గాయని,.బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవితం ఆధారంగా రూపొందించిన బయోపిక్ ఇది. ఇందులో ఆనంది ప్రధాన పాత్ర పోషించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. కథ 1965 ప్రాంతంలో విజయనగరం జిల్లాలోని గరివిడి గ్రామంలో ప్రారంభమవుతుంది. విజయలక్ష్మి (ఆనంది) పేద కుటుంబంలో జన్మిస్తుంది. తల్లి దేవుడమ్మ (రాశి). కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు, తల్లిదండ్రుల మధ్య విభేదాలు చిన్నతనం నుంచే లక్ష్మి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. చిన్న వయసులోనే ఆమె తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకుంటాడు . లక్ష్మికి కేవలం 12 ఏళ్ల వయసులోనే పెళ్లి జరుగుతుంది. అయితే భర్త మరో మహిళ కోసం ఆమెను వదిలి వెళ్లిపోతాడు. ఈ సంఘటనతో లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతుంది జీవితంలో ఎదురైన అవమానాలు, బాధల మధ్య పాటలే ఆమెకు ఓదార్పుగా నిలుస్తాయి.
లక్ష్మికి చిన్నప్పటి నుంచే అద్భుతమైన సంగీత ప్రతిభ ఉంటుంది. ఒకసారి పాట వింటే దాన్ని గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఆమెకు ఉంటుంది. రాంబాబు (వి.కె. నరేష్) ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తాడు. సత్తిబాబు (రాగ్ మయూర్) కూడా తన కళా ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు.
మొదట బుర్రకథల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. తరువాత జానపద పాటలపై దృష్టి పెడుతుంది.
లక్ష్మి తనదైన శైలిలో జానపద పాటలు పాడటం ప్రారంభిస్తుంది. ఆమె పాటలకు గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. బుర్రకథలు, జానపద గేయాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు చేరువవుతుంది. క్రమంగా ఆమెకు పేరు, డబ్బు, గుర్తింపు వస్తాయి. గరివిడి గ్రామం పేరే ఆమెకు గుర్తింపుగా మారుతుంది. అలా విజయలక్ష్మి కాస్తా గరివిడి లక్ష్మిగా ప్రసిద్ధి చెందుతుంది.ఇదే సమయంలో ఆమె జీవితంలో మరో విషాదకరమైన అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆమె పాటలను వ్యాపారానికి ఉపయోగించుకుంటారు. ఆడియో క్యాసెట్ల ద్వారా ఆమె కళను ఇతరులు సొమ్ము చేసుకుంటారు. సినిమా రంగంలోనూ ఆమెకు అన్యాయం జరుగుతుంది. ఆమె పేరుతో రావాల్సిన గుర్తింపును ఇతరులు పొందుతారు.


















