అమరావతి : తెలుగుదేశం పార్టీకి ఘనమైన చరిత్ర ఉందన్నారు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి. నిన్న ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి యావత్ రాష్ట్ర మహిళల తరపున మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని నారా లోకేష్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. పట్టెడన్నం పెట్టడమే పరిపాలన అయితే, మెరుగైన వైద్యం ఇవ్వడమే పరిపాలన అయితే, బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా, భరోసాగా నిలవడమే అధినాయకత్వం అయితే ఆ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు, సాధికారత, యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణతో పేదరిక రహిత రాష్ట్రం లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారంటూ ప్రశంసించారు.
చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజా భరోసా కలిసి ముందుకు సాగుతున్నాయని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం, ఆర్థిక సామాజిక ఉన్నతి కోసం టీడీపీ ప్రస్థానం ఎన్నో కష్టాలు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోందన్నారు. ఎన్టీఆర్ నుంచి లోకేష్ వరకు, సామాన్య కార్యకర్త నుంచి చంద్రన్న దాకా అందరూ పోరాటాలతోనే పార్టీని నిలబెట్టారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జీవం కోల్పోయిన రాష్ట్రాన్ని టీడీపీ నాయకత్వం ముందుకు నడిపించిందని ప్రశంసలు కురిపించారు. గత పాలనలో తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతింది, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ వాపోయారు.44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, త్యాగాలను కొద్ది సమయంలో వివరించడం సాధ్యం కాదన్నారు.

















