హైదరాబాద్ : రోడ్డు భద్రతపై సమన్వయ చర్యల కోసం ‘ఫ్యూచర్ సిటీ’ పోలీసులు ఫోకస్ పెట్టారు. గత మూడేళ్లలో 176 ప్రాణాంతక , 250 ప్రాణాపాయం లేని ప్రమాదాలతో సహా మొత్తం 426 ప్రమాదాలు నమోదైన 31 ‘బ్లాక్ స్పాట్ల’ (ప్రమాదకర ప్రాంతాలు) పై ఈ సమావేశంలో సమీక్షించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి రోడ్డు భద్రతకు సంబంధించిన వివిధ విభాగాల సమన్వయ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రతను మెరుగు పరిచేందుకు సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టే ఉద్దేశంతో పోలీస్, రవాణా, రోడ్ల భవనాలు , మున్సిపల్, జీహెచ్ఎంసీ , ఎన్ హెచ్ ఏఐ, ఆర్టీసీ, ఆరోగ్య శాఖ , సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. జాయింట్ పోలీస్ కమిషనర్ చందన దీప్తి , ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రోడ్డు భద్రత సమస్యలు, ట్రాఫిక్ నిర్వహణ సవాళ్లు . అవసరమైన సరిదిద్దే చర్యలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు.
గత మూడేళ్లలో 426 ప్రమాదాలు జరిగిన 31 బ్లాక్ స్పాట్లపై సమీక్ష జరుగగా రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించిన మరణాల పరిస్థితిని కూడా పరిశీలించారు: 2024లో 800 మరణాలు, 2025లో 732 మరణాలు , 2026 సెప్టెంబర్ నాటికి 470 మరణాలు నమోదయ్యాయి. ప్రమాదాలు , మరణాలను తగ్గించడం, బ్లాక్ స్పాట్లను సరిచేయడం, ఆక్రమణలు , ట్రాఫిక్ అడ్డంకులను తొలగించడం, రోడ్లపై వెలుతురును మెరుగు పరచడం , అవసరమైన రోడ్డు-ఇంజనీరింగ్ చర్యలు చేపట్టడం వంటి అంశాలపై నిర్ణీత కాలపరిమితితో కూడిన, అంతర్-విభాగాల ఉమ్మడి చర్యల ఆవశ్యకతను తరుణ్ జోషి నొక్కి చెప్పారు. ఆక్రమణలు, భారీ వాహనాల రాకపోకలు, సరిపడా రోడ్డు వెడల్పు లేకపోవడం, వాణిజ్య కార్యకలాపాలు , పాదచారుల కదలికల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాలను కూడా ఈ సమావేశంలో పరిశీలించారు. ప్రతి ప్రాణాంతక ప్రమాద ఘటనలోనూ, ప్రమాదానికి కారణమైన అంశాలను గుర్తించి సరిదిద్దే చర్యలు చేపట్టేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించేటప్పుడు, ప్రమాద వివరాలను పునర్నిర్మించేటప్పుడు పోలీసులతో సమన్వయం చేసుకోవడానికి సంబంధిత శాఖలు ఒక నోడల్ లేదా సబార్డినేట్ అధికారిని నియమించాలని ఆయన ఆదేశించారు. రోడ్డు భద్రత అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని నొక్కి చెప్పారు. , ప్రాణాలను కాపాడటానికి మరియు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడానికి సంబంధిత శాఖలన్నీ సన్నిహిత సమన్వయం, జవాబుదారీతనం మరియు సకాలంలో చర్యలు చేపట్టాలని తరుణ్ జోషి పిలుపునిచ్చారు.
















