అమరావతి : రాష్ట్రంలో హస్త కళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. జాతీయ హస్త కళల వారోత్సవాల్లో భాం గంగా రెండ్రోజుల కిందట ఢిల్లీలో భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 2023, 2024కు సంవత్సరాలకు సంబంధించి ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి చెందిన అయిదుగురు హస్త కళాకారులు అవార్డులు అందుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఈ అవార్డులు ఏపీకి వరించాయన్నారు. జాతీయ హస్త కళల వారోత్సవాలు (డిసెంబర్ 8–14) సందర్భంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 2023, 2024కు సంవత్సరాలకు సంబంధించి అవార్డులు ప్రకటించిందని తెలిపారు మంత్రి సవిత.
ఏపీకి 2023 సంవత్సరానికి రెండు అవార్డులు, 2024 సంవత్సరానికి ఒక అవార్డుతో పాటు రెండు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు లభించాయన్నారు. 2023కు సంబంధించి, మహిళల విభాగంలో శ్రీ కృష్ణ చరిత తోలు బొమ్మల తయారీలో డి.శివమ్మకు శిల్ప గురు అవార్డు లభించిందన్నారు. కలంకారి హ్యాండ్ పెయింటింగ్‌లో విజయలక్ష్మికి జాతీయ హస్తకళ అవార్డు వరించిందన్నారు. 2024కు సంబంధించి ఏటికొప్పాక బొమ్మల తయారీలో గోర్సా సంతోష్ కు జాతీయ అవార్డు, తోలు బొమ్మల తయారీలో కందాయ్ అంజన్నప్పకు, క్రాఫ్ట్ లో తోలుబొమ్మల తయారీ విభాగంలో ఖండే హరనాథ్ కు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు వరించాయన్నారు. అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారన్నారు.
















