Aadhaar : భారతదేశంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆధార్ (Aadhaar) కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇందులో పేరు, చిరునామా, వయస్సు, లింగం, బయోమెట్రిక్ వివరాలు వంటి అన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం ఉండటం వల్ల ఇది అత్యవసర పత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆధార్ కార్డులను నిర్వహించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.
Aadhaar – ఆధార్ – భారతీయుల ప్రధాన గుర్తింపు పత్రం
ఆధార్ కార్డు భారతీయ పౌరులకు జారీ చేసే విశిష్ట గుర్తింపు పత్రం. ప్రభుత్వం ఆధార్‌ను పాన్, ఓటరు ఐడీ వంటి ఇతర గుర్తింపు పత్రాలతో అనుసంధానం చేయాలని తరచూ సూచిస్తోంది. ఆధార్‌లోని వివరాలు ఖచ్చితంగా ఉండటం అత్యవసరం. ఎందుకంటే ఇతర పత్రాలతో వివరాలు సరిపోకపోతే, బ్యాంకింగ్, రేషన్, పాన్ లింకింగ్ వంటి సేవల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు.
15 సంవత్సరాల పిల్లల కోసం బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి
పిల్లలు 15 సంవత్సరాలు నిండినప్పుడు వారి వేలిముద్రలు, కంటి బొమ్మలు (ఐరిస్) మారుతాయి. అందువల్ల UIDAI తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలని సూచిస్తోంది. ఇంతవరకు దీనికి ₹125 రుసుము వసూలు చేస్తుండగా, ఇప్పుడు పెద్ద నిర్ణయం తీసుకుంది.
ఒక సంవత్సరం పాటు ఉచిత అప్‌డేట్ సదుపాయం
UIDAI ప్రకారం, పిల్లల బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయం ఒక సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయం 2025 అక్టోబర్ 1 నుండి 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ వ్యవధిలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సమీపంలోని ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రంలో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
UIDAI సూచన
UIDAI తల్లిదండ్రులకు పిలుపునిస్తూ, పిల్లల ఆధార్ వివరాలు సమయానుకూలంగా అప్‌డేట్ చేయాలని, ఆధార్ డేటా ఖచ్చితత్వం భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు పొందడంలో కీలకమని పేర్కొంది.
Also Read : Hyundai Huge Investment : వచ్చే 5 ఏళ్లలో భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టనున్న హ్యుండయ్



















