నల్గొండ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో ‘హ్యామ్’ విధానంలో చేపడుతున్నరూ. 13,000 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ధి పనులకు ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. హ్యామ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిందని, అదే నమూనాలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 6,300 కిలోమీటర్ల రహదారులను 34 ప్యాకేజీల్లో డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వర్క్ ఆర్డర్లు జారీ చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల అమలు కోసం తాను గత ఏడాది కాలంగా నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రి సీతక్క ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరో రూ. 7,000 కోట్ల అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా పనులకు సంబంధించి 17న సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లా కనగల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి తెలిపారు. మొదటి ప్యాకేజీ కింద దర్వేష్‌పురం నుంచి గుర్రంపోడు, మల్లెపల్లి, దేవరకొండ మీదుగా దిండి వరకు సుమారు ₹300 కోట్లతో డివైడర్‌తో కూడిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మార్గంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక రెండవ ప్యాకేజీ కింద చిట్యాల నుంచి రామన్నపేట, వలిగొండ, భువనగిరి మీదుగా జగదేవ్‌పూర్ వరకు సుమారు ₹300 కోట్లతో డబుల్ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో కూడా సుమారు ₹300 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
