హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మాజీ ఎంపీ వి. హనుమంత రావు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమానికి సీఎంతో పాటు తాను కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డిపై కొందరు లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేయడంపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఓయూను అభివృద్ది చేయాలని సీఎం కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ సమయంలో రూ. 1000 కోట్లు నిధులు కేటాయించడం మామూలు విషయం కాదన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ ఏనాడూ ఓయూను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
నా రాజకీయ జీవితంలో ఎందరో సీఎంలను చూశానని అన్నారు వి. హనుమంత రావు. కానీ విజన్ ఉన్న ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి అంటూ పేర్కొన్నారు. సర్కారు బడిలో చదివిన రేవంత్ రెడ్డి ఒక విజన్ తో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారని చెప్పారు. సంపద సృష్టించి అందరికీ న్యాయం జరిగే దిశగా ప్రజా పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు మాజీ ఎంపీ. ఉస్మానియా యూనివర్సిటీపై ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కమిట్‌మెంట్ తో ఆలోచించ లేదని అన్నారు. ఓయూ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కితాబు ఇచ్చారు. ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు.
















