హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్. మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులు చర్లకోల లక్ష్మా రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఈ సందర్భంగా స్వంత జిల్లా అని పదే పదే చెబుతూ వస్తున్న రేవంత్ రెడ్డి పనిగట్టుకుని పచ్చని పాలమూరును పడావు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్న మోటర్లు ఏడాదికి 200 రోజులు నడిస్తే, జూరాల మీద ఉన్న మోటర్లు కేవలం 45 రోజులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. అంటే జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేనట్టే కదా అని ప్రశ్నించారు. అలాంటి జూరాల మీద ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు మేలు చేస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కోయిలకొండ వద్ద రెండు పెద్ద రిజర్వాయర్లు కడతామని చెప్పారు.. అక్కడ ఒక లొకేషన్లో వెయ్యి ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది, ఇంకో దాని వద్ద 500 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉందన్నారు. అంత ఫారెస్ట్ భూమిని సేకరించడానికి సాధ్యం కాదన్నారు. కేంద్రం అనుమతి ఇవ్వదు కాబట్టి ప్రాజెక్ట్ పెండింగ్ పడుతుందన్నారు మాజీ మంత్రులు చర్లకోల, సింగిరెడ్డి, విరసనోళ్ల. ఫారెస్ట్ ల్యాండ్ మాత్రమే కాకుండా 45 గ్రామాలు కూడా ఎఫెక్ట్ అవుతాయని ఆవేదన చెందారు. 3 లక్షల పైచిలుకు ప్రజలను ఖాళీ చేయించాల్సి ఉంటుందన్నారు. 77 వేల ఎకరాల భూమిని సేకరించాలన్నారు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒక పనికిరాని ప్రాజెక్టు అని అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ఆనాడు 2 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కేవలం ఒక ఎకరం ఆయకట్టు కోసం మాత్రమే నిర్మిస్తున్నారని ఆరోపించారు.















