హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు. శనివారం తలసాని మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా తన పదవికి, తనకు తగదన్నారు. ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రివై ఉంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. జనం ఈ రకమైన భాషను, అహంకారాన్ని భరించరని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ముందు నీ భాషను మార్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక మాట్లాడాల్సి వస్తే నీకంటే తమకే ఎక్కువగా బూతులు వస్తాయన్నారు . కానీ సభ్యత, సంస్కారం అనేది ఉంటుందని, అందుకే తాము కట్టుబడి ఉన్నామమని స్పష్టం చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
ముఖ్యమంత్రి హోదాకు తగినట్లు హుందాగా నడుచుకోవాలని సూచించారు . ఇంకా కావాలని అనుకుంటే మంచి పనులు చేసి ప్రజల మన్ననలను పొందాలన్నారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక హామీలను ఎగ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్నారు.. రెండేళ్ల నుండి ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో డివిజన్ల ఏర్పాటు అంతా గందరగోళంగా ఉందన్నారు.

















