అమరావతి : రాష్ట్రంలో కూటమి రాచరిక పాలన సాగిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. గత కొంత కాలంగా ఏపీలో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిగట్టుకుని తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబులపై దాడులకు దిగారని, హత్యా యత్నం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. పవర్ ఉంది కదా అని రెచ్చిపోతే చివరకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆనాడు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గనుక రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఉంటే ఇవాళ మీరు పవర్ లోకి వచ్చి ఉండే వారు కాదన్నారు. ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని సెలవు ఇచ్చారు. ఇంకా మీకు మూడేళ్లు ఉన్నాయి. ఇలానే కేసులు పెడతాం, ఇలానే దాడులు చేస్తాం అంటే మీ ఇష్టం అన్నారు. 2029లో మా ప్రభుత్వం వచ్చాక, ఇంతకంటే ఎక్కువే ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచచ్చారు అనిల్ కుమార్ యాదవ్.

















