అమరావతి : ఏపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఆనాడు జగన్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఇందులో భాగంగా ఏకంగా 17 కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కానీ అనూహ్యంగా తాము పవర్ లోకి రాక పోవడంతో అధికారంలో కొలువు తీరిన ఏపీ కూటమి సర్కార్ అడ్డగోలుగా వాటిని పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పాలన సాగించడం లేదని , ఏపీ రాష్ట్రం పాలిట శాపంగా మారారంటూ మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రాజధాని పేరుతో భూముల వ్యాపారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలు, తమ అనుయాయులు, బంధువులకు అప్పనంగా కట్టబెట్టేందుకు లోపాయికారిగా ప్రయత్నాలు ప్రారంభించారని ధ్వజమెత్తారు పేర్ని నాని. తక్షణమే ఇలాంటి వాటికి చెక్ పెట్లాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు. తాము పవర్ లోకి వచ్చాక వారి చిట్టా బయట పెడతామని, ఒప్పందాలను రద్దు చేస్తామని అన్నారు.
