అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణకు చెందిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయనకు పిచ్చి పట్టిందన్నారు. తనను పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాను సినిమాటోగ్రఫీ మంత్రి అపాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. తన సినిమా మ్యాట్నీ నుండి అదే ఆగిపోతుందని, ప్రత్యేకించి ఆపాల్సింది ఏమీ లేదన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్న వాళ్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బికారులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి గురించి ఏనాడైనా పవన్ కళ్యాణ్ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు పేర్ని నాని.
విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ రెచ్చి పోతున్నాడని ఆరోపించారు. ఇదే సమయంలో తనతో సినిమా తీసిన నిర్మాత సర్కార్ కు న్యాయంగా రావాల్సిన పన్ను (జీఎస్టీ)ను ఎగ్గొట్టాడని, ఇప్పటి వరకు కట్టలేదన్నారు పేర్ని నాని. ఈ విషయం గురించి ఎందుకు జీఎస్టీ కట్టలేదంటూ ఒక్క అధికారి అయినా అడిగిన పాపాన పోలేదంటూ వాపోయారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ గా ఇప్పటికే గుర్తింపు పొందారని, ఆయన టిఫిన్ ఒక చోట లంచ్ మరో చోట ఇలా తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్రానికి ఏం చేస్తారంటూ సెటైర్ వేశారు.















