హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అధికారం ఉంది కదా అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలను కావాలని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించినా తాము బెదిరేది లేదన్నారు కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుపాలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ చేసిన కుట్రలు సాగలేదన్నారు. కోర్టు తనకు బెయిల్ మంజూరు చేశారని చెప్పారు కేటీఆర్.
ఇవాళ ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సర్కార్ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా లేదా ఇబ్బందులకు గురి చేసినా ఎవరూ ఇక్కడ భయపడరని అన్నారు. సర్కార్ చేస్తున్న నిర్వాకం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని, రాచరిక పాలన సాగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి పనికి రాడని అన్నారు. తను కేవలం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని, పరిపాలించడం చేత కావడం లేదన్నారు కేటీఆర్. తమ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తే రేవంత్ రెడ్డి వచ్చాక దానిని విధ్వంసం చేసే పనిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
