కరీంనగర్ జిల్లా : తెలంగాణ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని 400 కోట్ల రూపాయలతో కేసీఆర్ గతంలో ప్రారంభించారని కానీ కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇది దేశంలోనే కాక, బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేని వినూత్న పథకమని పేర్కొన్నారు. బీడీలు చుడుతూ ఆరోగ్యాన్ని కోల్పోతున్న మహిళలకు మంచి వాతావరణంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపెరల్ పార్కును, దానికి అనుసంధానంగా ప్రారంభించారని వివరించారు.
దాదాపు 50 షెడ్ల నిర్మాణాలు రెండేళ్ల కిందటే పూర్తయ్యాయని, పవర్ లూమ్‌లను సబ్సిడీపై అందించి కార్మికులనే యజమానులుగా మార్చాలనే అద్భుత ఆలోచన దీనిలో ఉందని తెలిపారు కేటీఆర్. అపెరల్ పార్కును పరిశీలించారు. షెడ్లన్నీ నిరుపయోగంగా మారి, పిచ్చి చెట్లు మొలిచి, కనీస నిర్వహణ కూడా లేకుండా అధ్వాన స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల వాటిని వడ్ల నిల్వలకు ఉపయోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని అన్నారు. నేత కార్మికులు ఆసాములుగా, వర్కర్ ఓనర్లుగా మారాలని, సిరిసిల్ల ఒక తిరుపూర్ మాదిరిగా వేల కోట్ల రూపాయల వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలని బీఆర్ఎస్ ఆకాంక్షగా పేర్కొన్నారు.
