హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. మంగళవారం సిట్ పేరుతో హరీశ్ రావును 7 గంటల పాటు విచారణ చేపట్టడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేవలం లీకులిచ్చి ఎన్ని రోజులు ఇలా బతుకుతావు అంటూ మండిపడ్డారు కేటీఆర్. ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక సమాచారం లేకుండా ఎన్ని రోజులు ఈ తమాషాలు నడిపిస్తావు రేవంత్ రెడ్డి? అంటూ ఫైర్ అయ్యారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారిక ప్రకటన రాలేదన్నారు. గతంలో హరీష్ రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు కేటీఆర్. కానీ కేవలం హరీష్ రావుపై కుట్రతో సుప్రీంకోర్టు జైలుకు పంపించాలన్న దురుద్దేశంతోనే సుప్రీంకోర్టులో ప్రజల డబ్బులు పెట్టి మరీ ప్రభుత్వం వాదించిందన్నారు.
నిన్న రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందు వల్లనే హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. అయినా బెదిరేది లేదన్నారు. హరీష్ రావు బొగ్గు కుంభకోణంలో బయట పెట్టిన సమాచారం తప్పు అయితే, సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఒక్కరూ ఎందుకు మాట్లాడ లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ కుంభకోణాలను బయట పెట్టిన ప్రతిసారీ కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నదని అన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా సింగరేణి టెండర్లను రిగ్గింగ్ చేయడం జరిగిందని ఆరోపించారు కేటీఆర్. ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మైనస్ టెండర్లు పడే చోట అంచనా విలువకన్నా అధికంగా టెండర్లు వేశారని ఆరోపించారు.
