జనగామ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనగామ పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదన్నారు. బ్లాక్ మెయిల్ చేయడంలో నెంబర వన్ అంటూ ఎద్దేవా చేశారు. నీళ్ల గురించి కేసీఆర్ కి గోదావరి ఎక్కడుందో తెలియని రేవంత్ రెడ్డి పాఠాలు చెప్పాలని అనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. విచిత్రం ఏమిటంటే భాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెప్పడం బాదాకరమన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయి పోయింది. ఎలా ప్రజలను మోసం చేశారో ఆలోచించాలని అన్నారు. రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 420 హామీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారని వాపోయారు. ఎనకటి రోజులు తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు, అదే రాబందు కాలం తెచ్చాడని మండిపడ్డారు. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారని అయినా సోయి రావడం లేదన్నారు కేటీఆర్. తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
