ఏదైనా ఉంటే ఇంట్లో కొట్లాడాలి : కేటీఆర్

సోద‌రి క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కామెంట్స్

hellotelugu-KTR

హైద‌రాబాద్ : కల్వ‌కుంట్ల క‌విత బీఆర్ఎస్ తీరును విమర్శిస్తూ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కుటుంబంలో సమస్యలు సహజమని అన్నారు. ఏవైనా ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకుని కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. విభేదాలను పక్కన పెట్టి, 2028 ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. కవిత దూకుడుపై పార్టీలో చర్చ జరుగుతున్న తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రియల్ ఎస్టేట్ దందా తప్ప, ప్రజా సమస్యలు ప‌ట్టించు కోవ‌డం లేదంటూ కాంగ్రెస్ స‌ర్కార్ పై మండిప‌డ్డారు.

హెచ్‌సీయూ, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో భూముల కోసం అరాచకాలు సృష్టించి, ఇప్పుడు మనూ భూములపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ కన్ను పడిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్.
ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసి, తమ రియల్ ఎస్టేట్ దందా కోసం దోచుకోవాలని కుట్రలకు పాల్ప‌డుతున్నారంటూ అనుముల అన్న‌ద‌మ్ముల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌ను మళ్లా మొలకెత్త నీయనని రేవంత్‌రెడ్డి అంటున్నాడ‌ని, కేసీఆర్‌ను మొలకెత్తనీయక పోవుడేంది? తెలంగాణనే మొలిపించిన మొగోడు.. మొనగాడు కేసీఆర్ అని అన్నారు కేటీఆర్.

ఆరు దశాబ్దాలు తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ తొక్కిపెడితే, మొలకెత్తనే మొలకెత్తదని విర్రవీగితే, మీరు కాదన్నా.. రాదన్నా.. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను మొలిపించినోడు కేసీఆర్ అని అన్నారు. ఆ విష‌యం తెలుసుకోకుండా అడ్డ‌గోలుగా వాగితే రేవంత్ రెడ్డికి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు కేటీఆర్.

Exit mobile version