హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సమున్నత చరిత్ర, వారసత్వం కలిగిన తెలంగాణ ప్రాంతాన్ని పనిగట్టుకుని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. శనివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడవ గ్యారంటీ అని చెప్పిన సీఎం ఇవాళ ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అధికారం కొద్ది సేపే అన్నది గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనుసన్నలలో పాలన సాగిస్తూ తెలంగాణ పాలిట శాపంగా మారాడని ఆరోపించారు హరీశ్ రావు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం తమ పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు అని అన్నారు హరీశ్ రావు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
