కేరళ : మాజీ సీఎం పినరయ్ విజయన్ యుడీఎఫ్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంఏవైయు -2.0 విషయంలో గృహ నిర్మాణానికి సంబంధించిన సాయంలో కోత విధించడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేంద్రం కేవలం రూ. 1.5 లక్షల సాయం మాత్రమే అందిస్తున్నప్పటికీ, పేద లబ్ధిదారుల కోసం నిర్మించిన ఇళ్లపై కేంద్రం లోగో , చిహ్నాన్ని ప్రదర్శించాలన్న కేంద్రం పట్టుదలకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిందని ఆయన ఆరోపించారు. పీఎంఏవై రెండవ దశను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు; దీనివల్ల గృహ నిర్మాణ సాయం రూ. 4 లక్షల నుండి రూ. 3 లక్షలకు తగ్గుతుందని ఆయన ఆరోపించారు. నిర్దేశిత అర్హత ప్రమాణాల ఆధారంగా కేరళలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0స అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. కేంద్రం విధించిన షరతులను అంగీకరిస్తూ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం, నిరాశ్రయులైన కుటుంబాలకు గౌరవ ప్రదమైన జీవనాన్ని కల్పించే ‘లైఫ్ మిషన్’ ప్రాజెక్ట్‌ను దెబ్బతీస్తుందని విజయన్ పేర్కొన్నారు.
నిరాశ్రయులు గౌరవంగా జీవించడానికి ఇళ్లను అందించిన ‘లైఫ్’ ప్రాజెక్ట్‌ను నాశనం చేయడం తప్ప మరోటి కాదన్నారు . లబ్ధిదారుల నుండి ఎటువంటి ఆర్థిక సహకారం అవసరం లేకుండానే తమ ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసిందని, అయితే రెండవ దశ అమలు పేరుతో మంత్రివర్గ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చివేసిందని విజయన్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న పథకం కింద, కేంద్రం వాటా అయిన రూ. 1.5 లక్షలతో సహా ఒక్కో ఇంటికి రూ. 4 లక్షలు మంజూరు చేసే వారని విజయన్ తెలిపారు. లబ్ధిదారులు ఎటువంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదని, మిగిలిన రూ. 2.5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం , స్థానిక స్వపరిపాలన సంస్థలు సంయుక్తంగా సమకూర్చేవని ఆయన పేర్కొన్నారు. కొత్త విధానం ప్రకారం, స్థానిక స్వపరిపాలన సంస్థల వాటా తగ్గించ బడిందని, లబ్ధిదారులు ప్రాజెక్ట్ వ్యయంలో 25 శాతం లేదా రూ. 1 లక్ష భరించాల్సి ఉంటుందని విజయన్ చెప్పారు.
