హైదరాబాద్ : రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్కలను సర్ ప్రైజ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. తనను మేడారం జాతర సందర్బంగా హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈసందర్బంగా సాదర స్వాగతం పలికారు బోయనపల్లి సంతోష్ రావు. అనంతరం కేసీఆర్ వారిని ప్రేమ పూర్వకంగా పలుకరించారు. ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం పలికారు. అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం చేశారు కేసీఆర్
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ , మహిళా ,శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా. తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.















