హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ రూ. 5 లక్షల కోట్ల స్కాంకు తెర లేపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన సుదీర్ఘ లేఖ రాశారు కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీకి. ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడేందుకు ప్లాన్ చేసినా ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. హెఐఎల్టీపీ పేరుతో భారీ స్కాంకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాహుల్ గాంధీ స్పందించకుంటే 5 లక్షల కోట్ల అవినీతిలో భాగ్యస్వామ్యం ఉన్నట్లేనని భావించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ఆస్తిని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారుస్తామని అనుకుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, ప్రజల ఆస్తులను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) ను 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో అతి పెద్ద భూ కుంభకోణంగా పేర్కొన్నారు. అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ అవినీతి విధానం కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువలో నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. , దీనివల్ల తెలంగాణ ప్రజలకు రూ 5 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.















