అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని అన్నారు. ప్రధానంగా విద్యుత్ ఛార్జీల భారం అధికంగా ఉండకుండా చూడాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను ఇంకా తగ్గించే అంశంపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఈ దిశగా చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలని అన్నారు. విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్ కు రూ. 4కు తగ్గించటంతో పాటు ప్రజలపై భారం వేయకుండా విద్యుత్ సంస్థల రుణాలు తీర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
సచివాలయంలో నేడు విద్యుత్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు. నూతన టెక్నాలజీని, ఇన్నోవేషన్లను వినియోగించుకుని విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.339 కోట్ల మేర ఆదా చేశామని అన్నారు. ఇదే తరహా పొదుపు చర్యలను మరింతగా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం. మిగతా రాష్ట్రాలలో ఎలా విద్యుత్ ఛార్జీల నియంత్రణ చేపడుతున్నారో పరిశీలించాలని అన్నారు . ఈ సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















