ఏపీలో నేరాల నివార‌ణ‌పై దృష్టి సారించాలి

హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆదేశం

hellotelugu-AnithaVangalapudi

అమ‌రావ‌తి : రాష్ట్రంలో నేరాల నియంత్ర‌ణ‌, నివార‌ణ‌పై అత్య‌ధికంగా దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. లా అండ్ ఆర్డ‌ర్ తో పాటు నేరాల‌కు సంబంధించిన అంశంపై ప్ర‌త్యేకంగా స‌చివాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి. ఈ సమావేశంలో ప్రస్తుత ఏడాదిలో నమోదైన నేరాలు, వాటిపై విధించిన శిక్షలు, కేసుల పురోగతిపై ఆరా తీశారు. నేరాల నియంత్రణ, కేసుల త్వరిత పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సైబర్ క్రైమ్, క్రిప్టో కరెన్సీ దుర్వినియోగం, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన నివారణ చర్యలపై ఫోక‌స్ పెట్టాల‌ని ఆదేశించారు.

సమావేశంలో భాగంగా నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మంది అధికారులను సన్మానించారు. వారి సేవలను ప్రశంసిస్తూ, ఇతరులకు ప్రేరణగా నిలవాలని సూచించారు వంగ‌ల‌పూడి అనిత‌. నూతన సంవత్సరంలో కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాల‌ని సూచించారు. నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . ఈ సమావేశంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, నిపుణులైన ప్రొఫెసర్లు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సమన్వయంతో కూడిన కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు ఈ సంద‌ర్భంగా మంత్రి. సిఐడి డిజి డాక్టర్ రవిశంకర్ , లీగల్ అడ్వైజర్ లక్ష్మణరావు, సిఐడి ఎస్పీలు పాల్గొన్నారు.

Exit mobile version