న్యూఢిల్లీ : దేశ రాజకీయాలలో పెను మార్పు చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అపారమైన అనుభవం కలిగిన టీఎంసీ పార్టీకి చుక్కలు చూపించింది. దీంతో భారీ విజయాన్ని నమోదు చేసిన బీజేపీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది బీజేపీ. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ నితిన్ నబిన్ ఆధ్వర్యంలో మంగళవారం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీకి చెందిన పెద్దలతో సమాలోచనలు జరపనున్నారు.
బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, ప్రతిపక్ష నేత సువేందు అధికారి హుటా హుటిన రాజధానికి బయలు దేరి వెళ్లారు. పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరన్న అంశంపై నేడు, రేపు ఢిల్లీలో బీజేపీ సమాలోచనలు జరపనుంది. పూర్తిగా హైకమాండ్ నిర్ణయమే అంతిమంగా ఉండబోతోంది. ఇదిలా ఉండగా సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ బెర్త్‌లు ఫైనల్ చేయనున్నది బీజేపీ హైకమాండ్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, నితిన్ నబీన్‌తో కూడిన పార్లమెంటరీ బోర్డ్ సమావేశం కానుంది. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో సమీక్ భట్టాచార్య, సువేందు అధికారి, సునీల్ భన్సల్, మంగళ్ పాండే, అమిత్ మాలవీయా ఉన్నారు.
మరో వైపు ముందు నుంచి బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు సువేందు అధికారి. ఆయన బలమైన టీఎంసీలో గతంలో కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత దీదీతో విభేదించారు. బీజేపీలో చేరారు. సీఎం అభ్యర్థి రేసులో ముందు వరుసలో ఉన్నప్పటికీ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
