అమరావతి : మామిడి రైతులకు కీలక సూచనలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ఒకేసారి కోతలు చేపట్టడం వల్ల మార్కెట్‌పై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంటుందని, అందువల్ల దశలవారీగా కోతలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు సూచించారు. దీనివల్ల నాణ్యత మెరుగు పడటంతో పాటు రైతులకు మెరుగైన ధర లభిస్తుందని తెలిపారు. తమిళనాడులోని కృష్ణగిరి మార్కెట్‌లో తక్కువ ధరలు నమోదవుతున్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం తమిళనాడు రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపి, మూడు రాష్ట్రాల్లో (ఏపి, తమిళనాడు, కర్ణాటక) సమాన ధరల విధానం అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుత సీజన్ ముగిసే వరకు జిల్లా యంత్రాంగం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
తోతపూరి మామిడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో పనిచేస్తుందని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్యను చేపడుతుందని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ దశలవారీ కోతలు, పరిపక్వ పండ్ల కోతపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం పల్ప్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, మామిడి ఆధారిత విలువ వృద్ధి ఉత్పత్తుల తయారీపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మామిడి తొక్కలు, గింజల వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలపై సాంకేతిక అవగాహన కల్పించేందుకు మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నటాజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) సహకారంతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరెంజ్ కేటగిరీలో ఉన్న పల్ప్ పరిశ్రమలను గ్రీన్ కేటగిరీలోకి మార్చే అంశాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలిస్తామని వెల్లడించారు.
















