శ్రీ‌వారి ఆల‌యం పుష్ప‌వ‌రిత శోభితం

వైభ‌వంగా ఉగాది ఆస్థానం

hellotelugu-Pushpaklankarana

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ ప‌రాభ‌వ‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభ‌వంగా జరిగింది. ఈ సందర్భంగా సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయం లోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు , ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింప‌జేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ ర‌వి చంద్ర‌, పులువురు బోర్డు స‌భ్యులు, జేఈవో (విద్య‌, వైద్యం) డాక్ట‌ర్ ఏ.శ‌ర‌త్‌, సీవీఎస్వో ముర‌ళీకృష్ణ‌ పాల్గొన్నారు. అనంత‌రం ఆల‌యం ముందు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌ మీడియాతో మాట్లాడుతూ దేశ, విదేశాల‌లో ఉండే శ్రీ‌వారి భ‌క్తుల‌కు నూత‌న శ్రీ ప‌రాభ‌వ‌ నామ‌ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంవ‌త్స‌రం అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని స్వామి వారిని ప్రార్థించిన‌ట్లు తెలియ‌జేశారు.

ఉగాది సంద‌ర్భంగా టీటీడీ ఉద్యాన‌వ‌న విభాగం శ్రీ‌వారి ఆల‌య‌ పరిసరాలు, మహాద్వారం, ఆలయం ముందు ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనలు జీఎన్‌సీ టోల్ గేట్ ప్రాంతాల్లో చేసిన పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Exit mobile version