తాడేపల్లి/అమరావతి : రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్దికి విశేష కృషి చేసిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య స్ఫూర్తితో చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. నేతన్నలు గౌరవ ప్రదమైన జీవనం సాగించేలా, వారికి ఆర్థిక మేలు చేకూరేలా సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. చేనేతల ఆత్మ గౌరవాన్ని పెంచుతూ, ప్రగడ కోటయ్య సేవలు భావి తరాలకు తెలియ జేయాలన్న సంకల్పంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరిగేలా ఉత్తర్వులు జారీచేశారన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి సవిత… ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ప్రగడ కోటయ్య అలుపెరగని కృషి చేశారన్నారు. చేనేతల సమస్యల పరిష్కారాని నాలుగు చేనేత సత్యగ్రహ ఉద్యమాలు నిర్వహించిన పోరాట యోధుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా చట్టసభల్లో చేనేత వాణి వినిపించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200లకు పైగా చేనేత సహకార సంఘాలు కోటయ్య ఏర్పాటు చేరన్నారు. కోటయ్య సేవలను భావి తరాలకు తెలియ జేయాలన్న సంకల్పంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిర్ణయించామన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రగడ కోటయ్య స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. నేతన్నలకు ఆర్థిక దన్ను కలిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
ఆగస్టు 7 నుంచి నేతన్న సేవలో..పథకానికి శ్రీకారం చుడుతున్నారని, ఈ పథకం కింద ఏటా రూ.25 వేలు అంద జేయనున్నారని తెలిపారు. ఇప్పటికే చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అంద జేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధిలో భాగంగా చేనేత క్లస్టర్లు, పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


















