ముంబై : ఏపీ రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఫిల్మ్ టూరిజం పాలసీని తీసుకు వస్తామని అన్నారు. ముంబయిలో జరుగుతున్న ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ – 2025’ లో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటా తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్, టూరిజం రంగాల భవిష్యత్తు అవకాశాలను ఇన్వెస్టర్లకు వివరించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు భారతదేశంలో రెండవ అతిపెద్ద ఇండస్ట్రీగా నిలదొక్కుకొందన్నారు. , బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కల్కి 2898 AD వంటి బ్లాక్‌బస్టర్‌లతో తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి దుర్గేష్. ఏపీలో 1,100 పైగా సినీ స్క్రీన్లు ఉండటం మన రాష్ట్రం సినీ రంగానికి ఎంత ముఖ్యమైన కేంద్రంగా ఎదిగిందో తెలిపే ఉదాహరణ మాత్రమేనని అన్నారు.
తెలుగు సినిమా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరించనున్నట్లు ఇన్వెస్టర్లకు తెలియజేశారు. ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునిక స్టూడియోలు, డబ్బింగ్ , రీ-రికార్డింగ్ సౌకర్యాల నిర్మాణానికి ప్రభుత్వం సంపూర్ణమైన మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. షూటింగ్‌ల కోసం ప్రభుత్వ, బహిరంగ ప్రాంతాల్లో అనుమతులు వేగంగా ఇస్తామన్నారు. పారదర్శకంగా లభించే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అలాగే కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను త్వరలోనే పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.



















