అమరావతి : ఏపీలో సినిమా పరిశ్రమను అభివృద్ది చేసేందుకు కూటమి సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కీలక ప్లాన్స్ తయారు చేస్తున్నారు. సినీ, పర్యాటక రంగాలకు పెద్ద ఎత్తున ప్రాదాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. ఏపీలోని విజయవాడకు సమీపంలో ఉన్న నందిగామలో సినీ స్టూడియో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈమేరకు ప్రతిపాదిత స్టూడియో కోసం నందిగామ సమీపంలో అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించే విషయంపై చర్చించేందుకు మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు డి. దిలీప్ రాజా , ఆయన బృందం మంగళవారం నందిగామ ఎమ్మెల్యే టి. సౌమ్యను కలిశారు. హైదరాబాద్ , విజయవాడ నగరాల మధ్య ఉండటంతో పాటు జాతీయ రహదారి ద్వారా మంచి రవాణా సౌకర్యం కలిగి ఉండటం వంటి కారణాలతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్-ఆంధ్రప్రదేశ్’ నందిగామ సమీపంలో సినీ స్టూడియోను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2018లో తెనాలిలో స్థాపించబడిన తమ సంస్థ రాష్ట్రంలో సినీ స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిందని రాజా తెలిపారు. హైదరాబాద్ , విజయవాడలోని నిర్మాణ సంస్థలు (ప్రొడక్షన్ హౌస్‌లు) ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు చిత్రీకరించడానికి, నిర్మించడానికి ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకే చోట నిర్మాణ సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల సినిమా నిర్మాణం సులభతరం అవుతుందని, తద్వారా నిర్మాణ సంస్థలను రాష్ట్రం వైపు ఆకర్షించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అనువైన భూమిని కేటాయిస్తే స్టూడియో నిర్మాణాన్ని చేపట్టడానికి మా – ఏపీ సిద్ధంగా ఉంది అని రాజా చెప్పారు. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో చర్చించినట్లు ఆయన తెలిపారు.
ప్రతిపాదిత స్టూడియోలో సినిమా నిర్మాణానికి అవసరమైన వివిధ సెట్‌లను నిర్మించే సదుపాయాలు ఉంటాయని ఆయన చెప్పారు. విలాసవంతమైన ఇల్లు, సంప్రదాయ మండువా ఇల్లు, పోలీస్ స్టేషన్, కోర్టు మరియు ఆసుపత్రి వంటి శాశ్వత లేదా పాక్షిక-శాశ్వత సెట్‌ల ఏర్పాటు కోసం ఒక ఆర్ట్ డైరెక్టర్ ప్రణాళికను సిద్ధం చేశారని స్పష్టం చేశారు.

















