సికింద్రాబాద్ : ఏసీబీ జూలు విదిల్చింది. వరుస దాడులతో బెంబేలెత్తిస్తోంది. మొన్నటికి మొన్న అతి పెద్ద అవినీతి తిమింగలం పట్టుబడింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ లో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్న కుమార్ ఇంట్లో దాడులు చేసింది. భారీ ఎత్తున నగదు, బంగారం బయట పడింది. ఇవాళ సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లంచం తీసుకుంటూ పట్టుబడింది మహిళా ఎస్ఐ. రూ. 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం కలకలం రేపింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకుని, తమ తల్లిదండ్రులు ఆ వివాహాన్ని అంగీకరించ కపోవడంతో పోలీసుల సహాయం కోరాడు యువకుడు అభిషేక్.
అభిషేక్ తల్లిదండ్రులతో మాట్లాడాల్సి ఉందని చెప్పి అతన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, డబ్బులు డిమాండ్ చేసింది మహిళా ఎస్.ఐ నందిత. డబ్బులు ఇవ్వడానికి అభిషేక్ నిరాకరించడంతో, అతను తన తండ్రిని కొట్టాడని ఆరోపిస్తూ అభిషేక్‌పై కేసు నమోదు చేసి, అతన్ని జైలుకు పంపింది ఆ ఎస్.ఐ. జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యాక ప్రతి సోమవారం సంతకం చేయడానికి స్టేషన్‌కు వచ్చే అభిషేక్ నుండి రూ. 10,000 డిమాండ్ చేశాడు రైటర్ విజయ్, రూ. 30,000 డిమాండ్ చేసింది ఎస్.ఐ నందిత. పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో విసిగిపోయి, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు అభిషేక్. బాధితుడిని తన స్కూటర్ తాళం చెవి ఇవ్వమని చెప్పి, ఆ డబ్బును స్కూటర్ డిక్కీలో పెట్టమని చెప్పింది ఎస్ఐ.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా స్కూటర్‌లో డబ్బులు ఉంచిన వెంటనే ఎస్.ఐ నందితను, రైటర్ విజయ్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
