హైదరాబాద్ : విద్యార్థులకు అందజేసిన పాఠశాల యూనిఫాంల గురించి వారి అభిప్రాయాలను (ఫీడ్బ్యాక్) సేకరించాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల నుండి అభిప్రాయాలను సేకరించడం ద్వారా భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థులు ఇష్టపడే రంగులు , డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ భూమి పెవిలియన్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు , వివిధ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు, కిట్ల పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గతంతో పోలిస్తే ఆకర్షణీయమైన రంగులు , డిజైన్లతో కూడిన అత్యుత్తమ నాణ్యత కలిగిన యూనిఫాంలను అందించినట్లు అధికారులు సమావేశంలో తెలిపారు. యూనిఫాంలతో పాటు టైలు, బెల్టులు, ఐడి కార్డులు, బూట్లు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, భోజన సామాగ్రి (కట్లరీ), కార్పెట్లు , స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు.
కొన్ని విద్యా సంస్థల పరిధిలో వస్తువుల పంపిణీ 95 శాతం వరకు పూర్తయిందని వివరించగా మిగిలిన వస్తువుల పంపిణీని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే యూనిఫాంలు , ఇతర సామగ్రికి సంబంధించి విధివిధానాలను ఇప్పటి నుండే రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు అందించాల్సిన వస్తువుల జాబితా రూపకల్పన నుండి టెండర్లు, సరఫరా , పంపిణీ వరకు అన్నీ నిర్ణీత సమయంలోపు పూర్తి కావాలని సూచించారు. పాఠశాలలు తిరిగి తెరిచే రోజు నాటికి అన్ని వస్తువులు అందుబాటులో ఉండేలా, ఇప్పటి నుండే కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, గిరిజన , వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

















