గుజరాత్ : రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాము పండించిన పంటలకు కనీస మద్దతు (ఎంఎస్పీ) ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. వ్యవసాయ భూముల్లో బలవంతంగా ఏర్పాటు చేస్తున్న అదానీకి చెందిన విద్యుత్ స్తంభాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో రైతులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాలు వేయడం కోసం తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గుజరాత్ వ్యాప్తంగా వందలాది మంది రైతులు అహ్మదాబాద్ నుండి గాంధీనగర్ వరకు తమ ట్రాక్టర్లను నడిపారు.
కాంగ్రెస్ , వివిధ ఇతర రైతు సంఘాలు నిర్వహించిన ‘కిసాన్ అధికార్ యాత్ర అహ్మదాబాద్‌లోని శాంతిపుర చౌక్‌డి నుండి ప్రారంభమై భారీ ట్రాక్టర్ల కాన్వాయ్‌తో రాష్ట్ర రాజధాని గాంధీనగర్ వైపు కదిలింది.పలువురు రైతులు తమ శ్రమకు నిరసనకు చిహ్నంగా నాగలిని పట్టుకున్నారు. రైతులకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ ర్యాలీలో చేరింది. శాంతిపుర చౌక్‌డి నుండి ఈ ర్యాలీ గాంధీనగర్‌కు చేరుకుంది .రుణమాఫీ, పూర్తి మద్దతు ధర చెల్లింపు, ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు తమను విశ్వాసంలోకి తీసుకోకుండా, సరైన నష్టపరిహారం చెల్లించకుండా వారి పొలాల్లో విచక్షణారహితంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడాన్ని ఆపడం వంటి పలు డిమాండ్లు రైతులకు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే తుషార్ చౌదరి అన్నారు.
















