హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. మే 6వ తేదీన రైతు సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి గురించి ఊసెత్తడం లేదన్నారు. ఆరుగాలం పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కందులు, వరి, తదితర పంటలు చేతికి వచ్చాయని, కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు కొన్ని చోట్ల ప్రారంభించ లేదన్నారు. నాలుగేండ్ల కింద రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌తో తెలంగాణ రైతాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు కేటీఆర్.
రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండున్నరేండ్లు గడిచినా ఏ ఒక్క హామీనీ నెరవేర్చ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే మే 6న బీఆర్ఎస్ భారీ రైతు సభ నిర్వహించాలని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. భారీ ఎత్తున రైతులు, ప్రజలు హాజరవుతారని తెలిపారు. ఇక నుంచి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలను ఎండగడుతూనే ఉంటామని ప్రకటించారు కేటీఆర్.
రైతులు అరిగోస పడుతున్నా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని, రాచరిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
