చెన్నై : డీఎంకే ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రీల్స్ పాలన సాగుతోందని అన్నారు. ఓ వైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. శాసన సభలో ఉదయనిధి సర్కార్ పనితీరు బాగోలేదంటూ ఆరోపించారు. టీవీకే పాలనలోని 105 రోజుల్లో ఆరుగాలం కష్టించే రైతులు తీవ్రంగా నష్ట పోయారని వాపోయారు ఉదయనిధి స్టాలిన్. మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం, రాయితీ గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి వంటి కీలక ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఉదయనిధి ఆరోపించారు. చెన్నైలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన సర్కార్ పై పలు ప్రశ్నలు లేవెనెత్తారు. ఈ ఏడాది మేట్టూర్ ఆనకట్టను ఇంకా తెరవక పోవడం వల్ల కురువై సాగు దెబ్బతిన్నదని ఆయన అన్నారు.
రైతులకు పరిహారం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తే, కురువై ప్యాకేజీని ఇప్పటికే ఇచ్చేశామని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్యాకేజీ అనేది సాగుకు సహాయపడటానికి ఉద్దేశించింది, కానీ పరిహారం అనేది జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి కాకుండా, సోషల్ మీడియా రీల్స్ చేయడానికి అసెంబ్లీకి వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం పనితీరు చూస్తుంటే, ఇది అసెంబ్లీనా లేక సర్కస్సా అనే సందేహం ప్రజలకు కలుగుతోందని అని ఉదయనిధి వ్యాఖ్యానించారు. కావేరీ గురించి మాట్లాడినప్పుడల్లా వారికి చిరాకు వస్తుంది అని ఆయన అన్నారు. తంజావూరులో రైతుల డిమాండ్లకు మద్దతుగా జరిగిన నిరసనలో తనను ఇటీవల అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.


















