అనంతపురం జిల్లా : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన పేరుతో రాచరిక పాలనను తలపించేలా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని, అన్ని వర్గాల ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. జనాన్ని బురిడీ కొట్టించడంలో , జిమ్మిక్కులు చేయడంలో, పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు రాటు దేలాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి. అనంతపురం జిల్లాకు కేంద్రం కేటాయించిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) ను రాకుండా చేశాడని ఆరోపించారు.
ఎయిమ్స్ ను తీసుకు పోయి అమరావతిలో పెట్టాడంటూ చంద్రబాబును ఉద్దేశించి మండిపడ్డారు కేతిరెడ్డి . కర్నూల్ కు హైకోర్టు వస్తే దానిని కూడా తీసేసిన ఘనత తనకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. బ్యాంకింగ్ సెక్టార్స్ కడపకు వచ్చిందని, అది కూడా తీసిన పాపం తనదేనని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే. చివరకు మరోసారి కరువును గుర్తుకు తీసుకు వచ్చేలా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తాగేందుకు నీళ్లు కూడా లేకుండా చేయడం దారుణమన్నారు. చరిత్రనే కాదు ప్రజలు కూడా క్షమించరని హెచ్చరించారు. ఓ వైపు ఖజానాకు భారం పడిందంటూ చెబుతూ వస్తున్న సర్కార్ ఆవకాయ్ అమరావతి అంటూ కార్యక్రమాన్ని నిర్వహించడం బక్వాస్ అంటూ భగ్గుమన్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
