అమరావతి : ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించే వివిధ పౌర సేవలు మెరుగ్గా అందించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవల్లో మెరుగైన ప్రజాభిప్రాయం కోసం పబ్లిక్ కనెక్ట్ అనేది కీలకమని సీఎం స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసాన్ని, క్రెడిబిలిటీని పెంచేలా ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ శాఖ నిర్దేశిత ప్రమాణాలకు తగినట్టుగా పని చేయాల్సిందేనని ముఖ్యమంత్రి సూచించారు. పంటలకు ధర విషయంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ ను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్టీజీఎస్ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించేలా సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
కార్యదర్శుల స్థాయి అధికారులు నెలలో 3 రోజుల పాటు, హెచ్ ఓడీలు 6 రోజుల పాటు, జిల్లా కలెక్టర్లు 8 రోజుల పాటు 7 క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని నిర్దేశించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం కాల్ సెంటర్ ద్వారా వివరాలను సేకరించాలని సీఎం సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఉత్తమ విధానాలు అనుసరించాలన్నారు. అధికారులు ఏ అంశంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారో అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయని.. మిగిలిన చోట్ల కూడా ఇదే చొరవ చూపాలన్నారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ శాఖలు అందించే మిగతా అన్ని సేవల్ని ఆన్ లైన్ లో అందించాలని స్పష్టం చేశారు. చేపల వేట నిషేధం ముగిసిన తర్వాత అవేర్ ద్వారా వచ్చే డేటా ఆధారంగా చేపలు సమృద్ధిగా లభించే ప్రాంతాలను మత్స్యకారులకు అందజేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈ సమీక్షకు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ జి. సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
