అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కడప ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్బంగా ఆ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ కడప స్మార్ట్ కిచెన్ ను సందర్శించాలని సీఎం అదేశం ఆదేశించారు. గురువారం ఆయా జిల్లా కలెక్టర్లతో జరిగిన సదస్సులో నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. కలెక్టర్లు కీలకమైన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. ఎవరు మంచిగా పని చేస్తారో వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. జీవితంలో అరుదైన అవకాశం కలెక్టర్ పోస్టు అని గుర్తించాలన్నారు.
ఈ సందర్భంగా కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ప్రాజెక్టును వివరించారు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. పౌష్టికాహారం విద్యార్ధులకు వేడిగా, రుచిగా అందించేలా ఈ స్మార్ట్ కిచెన్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రతీ మండలానికీ ఓ స్మార్ట్ కిచెన్ పెట్టి పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. స్మార్ట్ కిచెన్ కోసం 3 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశామని తెలిపారు కలెక్టర్. బేస్ కిచెన్ నుంచి ప్రతీ పాఠశాల 3 కిలోమీటర్ల లోపే ఉండేలా ప్రణాళిక చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం కడపలో 5 స్మార్ట్ కిచెన్లున్నాయని, త్వరలో జిల్లా వ్యాప్తంగా 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు కలెక్టర్.
