అమరావతి : గత ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే పరిమతం చేసినా ఇంకా బుద్ది రావడం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో అసలు సిసలైన ఫ్యాక్షనిస్ట్ జగన్ అని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్లపై ఎందుకు కక్షో అర్థం కావడం లేదన్నారు. తిరుమల ఏడుకొండల అంశాన్ని ప్రస్తావిస్తూ నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరచి పోలేదన్నారు. ఆ వ్యాఖ్యలను తప్పు పట్టిన చంద్రబాబు వ్యాఖ్యలను ఇప్పుడు జగన్ వక్రీకరించి ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది జగన్ అని బొత్సనే చెప్పారని నేను చెబితే ఆయన ఎందుకు ఏడ్చారో ఇప్పటికీ అర్థం కాలేదు అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించి, మళ్లీ వాళ్లకు రాజ్యసభ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. నీ సొంత చెల్లెలు వైఎస్ సునీత జగన్ ప్రమేయం ఉందని చెబుతోందని, దానికి సమాధానం చెప్పగలవా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం బాబాయినే కాదు, సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదల్లేదని తీవ్ర విమర్శలు చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి మరణం, బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామా గురించి మాట్లాడిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వాటిపై మాట్లాడలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబుకు నోటీసు కూడా ఇవ్వకుండా 53 రోజులు జైలులో పెట్టారని, తాను తప్పు చేయకపోయినా వేధింపులకు గురిచేశారని అన్నారు. అప్పటి ఎంపీ రఘురామ కృష్ణం రాజును చిత్రహింసలకు గురిచేశారని, కోర్టుల వల్లే ఆయన ప్రాణాలు దక్కాయని చెప్పారు. సోషల్ మీడియాలో తల్లి, చెల్లిని కూడా వదలకుండా అసభ్య పోస్టులు పెట్టించారని ఆరోపించారు.డాక్టర్ సుధాకర్ ఘటన, రేపల్లె నియోజకవర్గంలో అమర్‌నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ వైసీపీ పాలనలో జరిగిన దమనకాండకు ఇవే నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీసి ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
