విజయవాడ : వైద్య రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా డ్రోన్స్, రోబోటిక్ టెక్నాలజీని తరుచూ ఉపయోగించడం కొనసాగుతోంది. ఈతరుణంలో కీలక సదస్సుకు వేదిక కాబోతోంది ఏపీలోని విజయవాడ. యూరో-ఆంకాలజీ సింప్లిఫైడ్ – 2026 పేరుతో జరుగుతున్న ఈ సదస్సును సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రోబోటిక్ రాడికల్ ప్రోస్టాటెక్టమీ , రోబోటిక్ పార్షియల్ నెఫ్రెక్టమీ ప్రక్రియల ప్రత్యక్ష ప్రసారం ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనివల్ల పాల్గొనే వారు అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలుగుతుంది. విజయవాడలో ఇవాళ యూరోలాజికల్ క్యాన్సర్ల చికిత్సలో వచ్చిన పురోగతిపై రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు జరగనుంది.
ఇందులో ప్రోస్టేట్, మూత్రపిండం మరియు మూత్రాశయ క్యాన్సర్ల నిర్వహణలో తాజా పరిణామాలపై నిపుణులు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల నుండి 200 మందికి పైగా యూరాలజిస్టులు, సర్జన్లు, పీజీ విద్యార్థులు, యువ వైద్య నిపుణులు ఈ కార్యక్రమానికి నమోదు చేసుకున్నారు. సోగస్ ఏపీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి మధ్యంతర విద్యా పరమైన సమావేశం ఇదేనని నిర్వాహకులు తెలిపారు. ప్రశాంతి ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. యూరాలజీకి సంబంధించిన విద్యాపరమైన కార్యకలాపాలకు విజయవాడ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఎదిగిందని, అనేక రాష్ట్ర , జాతీయ స్థాయి సదస్సులకు ఆతిథ్యం ఇచ్చిందని ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎ.వి. కృష్ణ కిషోర్ పేర్కొన్నారు.

















