పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : పంచాయతీ రాజ్ వ్యవస్థలో నూతన సంస్కరణలతో కూటమి ప్రభుత్వం పాలనను ప్రజల చెంతకు చేర్చిందని అన్నారు మంత్రి ఎస్. సవిత. ప్రజా సమస్యల పరిష్కారానికి డీడీవో కార్యాలయాలు మంచి వేదికలవుతాయని అన్నారు. డివిజనల్ స్థాయిలో అన్ని కార్యాలయాలనూ ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం వల్ల అటు ప్రజలకు, ఇటు పాలనకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం కార్యాలయాలు నిర్మిస్తుంటే, ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చిన ఘనత జగన్ ది అని విమర్శించారు. పెనుకొండలో గురువారం నిర్వహించిన నూతన డీడీవో కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సవిత పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వ్యవస్థలో సంస్కరణ నాంది పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయం ఎంతో చారిత్రాత్మకమని కొనియాడారు. డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం వల్ల అటు ప్రజలకు, ఇటు పాలనకు ఎంతో మేలు కలుగుతుందన్నారు సవిత. డీడీవో కార్యాలయాలు మినీ కలెక్టరేట్లగా ప్రజా సమస్యల పరిష్కారానికి మంచి వేదికలుగా మారుతాయని స్పష్టం చేశారు. డీడీవో కార్యాలయాలకు శాశ్వత భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కు మంత్రి సవిత సూచించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

















