ESIC Scheme : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉద్యోగుల కోసం మరో కీలక చర్య తీసుకుంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) “SPREE-2025” అనే ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఉద్యోగుల సామాజిక భద్రత కవచాన్ని మరింత విస్తరించనుంది. జూలై 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది.
ESIC Scheme Updates
ఈ పథకం పరిధిలోకి రావాలంటే సంస్థలో కనీసం 10 మంది ఉద్యోగులు ఉండాలి. వీరిలో నెల వేతనం రూ.21,000 లోపువారికి ఈఎస్‌ఐ కవరేజ్ వర్తిస్తుంది. అయితే ఇప్పటివరకు చట్టబద్ధంగా నమోదు కాని యాజమాన్యాలు, ఉద్యోగులు తమ సంస్థలు, ఉద్యోగుల వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది. సంస్థ యాజమాన్యం పేర్కొన్న తేదీ నుంచే రిజిస్ట్రేషన్ చెల్లుబాటవుతుంది.
ESIC చట్టానికి లోబడి ఉండే సంస్థలు గత కాలానికి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఈ అవకాశం ద్వారా తమ సంస్థల వివరాలను నమోదు చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ చేసిన తేదీ నుంచి మాత్రం ప్రతి నెల చందా చెల్లించడం తప్పనిసరి.
ఈఎస్ఐసీ ప్రకారం, SPREE-2025 అమలుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 88,000 పైగా యాజమాన్యాలు, 1.02 కోట్ల మంది ఉద్యోగులు రిజిస్ట్రేషన్ పొందినట్లు సమాచారం. డిజిటల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ కోసం ESIC పోర్టల్, శ్రమ్ సువిధా పోర్టల్, ఎంసీఏ పోర్టల్స్ వేదికలుగా ఉన్నాయి.
ఈ పథకం ద్వారా కాంట్రాక్ట్ కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులు, చిన్న, మధ్యస్థ వ్యాపారాల్లో పని చేసే కార్మికులకు ఆరోగ్య, సామాజిక భద్రతా లాభాలు లభించనున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, గత కాలానికి సంబంధించి జరిమానా లేదా తనిఖీలు లేకుండా చేసిందీ పథకం ప్రత్యేకత.
తల్లిదండ్రుల శ్రేయస్సు – సంస్థల బాధ్యత
ఈ పథకం ద్వారా కార్మిక సంక్షేమం దిశగా కేంద్రం తీసుకున్న ఈ ముందడుగు ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చట్టబద్ధంగా తమ ఉద్యోగులకు భద్రత కల్పించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read : Gold Price Growth : గత 6 నెలల్లో 26 శాతానికి పెరిగిన పసిడి ధరలు
















