అమరావతి : మంత్రి లోకేష్ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయంలో జరిగిన ‘ఎరువాక పౌర్ణమి’ వేడుకల్లో పాల్్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ అధికారిక ప్రారంభాన్ని సూచించేలా ఈ వేడుకలు జరిగాయి. గుంటూరు సమీపంలోని లామ్ వద్ద ఉన్న ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లో సోమవారం సాంప్రదాయ ‘ఎరువాక పౌర్ణమి’ వేడుకల్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ అధికారిక ప్రారంభానికి సంకేతంగా నిలుస్తాయి. ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.వి. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ,రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
వీరితో పాటు పలువురు శాసనసభ్యులు , ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు , స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. రుతు పవనాల రాక సమయంలో, జ్యేష్ఠ మాసపు పౌర్ణమి రోజున ‘ఎరువాక పౌర్ణమి’ని జరుపుకుంటారు. ఇది రైతులకు, ప్రకృతికి మధ్య ఉన్న సన్నిహిత అనుబంధాన్ని తెలియజేసే ఒక ముఖ్యమైన వ్యవసాయ పండుగ. ఖరీఫ్ సీజన్‌కు స్వాగతం పలకడం, సమృద్ధిగా పంటలు పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించే ఆచారాలు ఈ వేడుకల్లో భాగంగా ఉంటాయి. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ నాగలికి పూజ చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వ్యవసాయ పనుల శుభ ప్రదమైన ప్రారంభానికి సంకేతంగా, అలంకరించిన ఎద్దులతో నాగలిని లాగించి భూమిని దున్నుతారు.
వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్, గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరు అయ్యారు. వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ మాట్లాడుతూ, సాంప్రదాయ విజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు ,శాస్త్రీయ వనరుల నిర్వహణను మేళవించడం ద్వారా వ్యవసాయాన్ని రైతులకు లాభదాయకంగా మార్చవచ్చని పేర్కొన్నారు.
