అమరావతి : మాజీ ఎంపీ , కేంద్ర మంత్రి చింతా మోహన్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ ప్రభుత్వ పరంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందంటూ మండిపడ్డారు. ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ కలెక్టరేట్ వద్ద తన ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులు 6 లక్షల మంది, మూడు రూపాయల వడ్డీకి తెచ్చి బిడ్డలను చదివించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఇచ్చేటువంటి జీతాలు చాలడం లేదన్నారు చింతా మోహన్.
గత ఎనిమిది సంవత్సరాలలో ధరలు బాగా పెరిగి పోయాయని వాటిని నియంత్రించడంలో బీజేపీ, ఎన్డీఏ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్‌సి అమలు చేయాల్సి ఉందన్నారు.YCP, TDP రాష్ట్ర ప్రభుత్వాలు పిఆర్‌సిని వేయకుండా కాలయాపన చేస్తూ పోతున్నాయన్నారు. రాష్ట్రం కోసం ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పని చేస్తున్నారన్నారు. వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా అధినేతలకు దొరకటం లేదన్నారు. పిఆర్‌సిని రేపు రాబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. నా మాట విని సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే పిఆర్‌సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.
