Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ మధ్య ముదురుతున్న రాజకీయ విభేదాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు సోమవారం 8 శాతం మేర పతనమయ్యాయి. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ సమయంలో టెస్లా షేరు ధర $291.96కి చేరింది.
Elon Musk Tesla Stocks Shocking
ఈ పతనం మస్క్ (Elon Musk) తీసుకున్న కీలక రాజకీయ నిర్ణయానికి అనుసంధానంగా చూస్తున్నారు. తాజాగా ఆయన ‘అమెరికా పార్టీ’ అనే కొత్త రాజకీయ పార్టీలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీనికి ముందు సోషల్ మీడియా వేదికగా “పార్టీ ప్రారంభించాలా?” అనే ఓటింగ్ నిర్వహించగా, దాదాపు 65 శాతం మంది అనుకూలంగా స్పందించారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, మస్క్ కొత్త పార్టీని ప్రకటించారు.
ఇటీవల ట్రంప్ ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై మస్క్ తీవ్రంగా విరుచుకుపడటం, ట్రంప్‌ను స్వయంగా విమర్శించడమే ఈ ఉద్రిక్తతలకు కారణమైంది. మస్క్ రాజకీయ అడుగులకు ట్రంప్ స్పందిస్తూ, “అతడు దారి తప్పిపోయాడు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, టెస్లా షేర్లు గత ఆరు నెలల్లో 20 శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. గత ఏడాది గరిష్టంగా $488.54 దాకా వెళ్లిన టెస్లా షేర్లు, కనిష్టంగా $182 వరకూ దిగజారాయి. ప్రస్తుతం టెస్లా షేర్ల ధరలు మస్క్ రాజకీయ ప్రచారాలకు లోనవుతున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ పరిణామాలు మస్క్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయన్నది పరిశీలనీయమైన అంశంగా మారింది. వ్యాపారరంగాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలన్న వాదనల నడుమ, ఈ మలుపు మరిన్ని చర్చలకు దారి తీసే అవకాశముంది.
Also Read : Trump Shocking Tariffs : ప్రపంచ దేశాల మీద మరోసారి మొదలు పెట్టిన ట్రంప్ టారిఫ్ లు
