చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు పాలనా పరంగా. తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఏపీని దేశంలో నెంబర్ వన్ చేయాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం తను దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఏపీకి రానున్నారు. వచ్చిన వెంటనే ఆయన చిత్తూరు జిల్లాలో ఈనెల 24న పర్యటిస్తారు. జిల్లాలోని నగరి పట్టణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ దుషార్ డూడి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలు, సభా ప్రాంగణం, రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ఎంట్రీ–ఎగ్జిట్ గేట్లు, బ్యారికేడింగ్, పోలీస్ పాయింట్లు, సభా వేదిక పరిసరాలు, ప్రజల రాకపోకల మార్గాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయాలని, వాహనాల పార్కింగ్ కోసం ముందస్తుగా కేటాయించిన ప్రదేశాలలోనే పార్కింగ్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రద్దీ ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా రూట్ అంతా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
