అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సాగు రంగంలో కీలకమైన మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి వ్యవసాయ రాబడిని పెంచేందుకు సమగ్ర పంట క్యాలెండర్ ను తయారు చేయాలని ఆదేశించారు. గురువారం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ మార్కెటింగ్‌పై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పంట ఎంపికలపై రైతులలో అవగాహన కల్పించాలని, ఉత్పత్తుల నాణ్యతను మెరుగు పరచడం, పంటకోత సమయంలో సకాలంలో మార్గదర్శకత్వం అందించడం అవసరమని నొక్కి చెప్పారు. అంతే కాకుండా రైతులకు గరిష్ట రాబడిని సాధించే లక్ష్యంతో విత్తనాలు, కోత, మార్కెటింగ్ కు సంబంధించి మెరుగైన ప్రణాళికను నిర్ధారించడానికి ప్రత్యేకంగా క్యాలెండర్ ఉండాలని స్పష్టం చేశారు సీఎం.
ఇందులో ప్రతి రైతుకు అవగాహన కల్పించేలా ఉండాలన్నారు. ఏయే సీజన్ లో ఏయే పంటలు వేయాలి, ఎలాంటి నివారణ జాగ్రత్తలు చేపట్టాలి, అందుబాటులో ఉండే వ్యవసాయ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు కూడా పొందుపర్చాలని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ కీలక సమావేశానికి వర్చువల్ గా హాజరయ్యారు మంత్రులు నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రత్యేకించి ఆహార ప్రాసెసింగ్ పై దృష్టి సారించాలని అన్నారు. కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లలో మన రాష్ట్రం నుంచి రైతులు తయారు చేసిన ఉత్పత్తులకు చోటు దక్కేలా చూడాలన్నారు. రవాణా చేయడానికి రైలు కార్గో వంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను సమర్థవంతంగా ఉపయోగించు కోవాలని ఆదేశించారు.
