న్యూఢిల్లీ : దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్ లో వివరించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలన్నా, దేశంలోని ప్రతి విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని చెప్పారు. దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధేనని గుర్తు చేశారు. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని సీఎం అన్నారు. ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (SEEEPC)లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో పైసలు, భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశంగా తేలిందని చెప్పారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించ వచ్చని స్పష్టం చేశారు.
విద్యా శాఖను తన వద్దే ఉంచు కోవడానికి కారణం విద్యపై తనకు ఉన్న నమ్మకమేనని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. గడచిన 75 ఏండ్లలో మనమంతా ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేశామని, కానీ నాణ్యమైన విద్యను అందించడం మనకు ఒక సవాలుగా మారిందన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సమాజంలో సమానత్వం పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం ద్వారా కుల వివక్ష తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
