కరీంనగర్ జిల్లా : అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం చేయడంలో, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్ అశోక్. దీంతో తను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ చర్యలు తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. రైతుల పక్షాన మాట్లాడితే ఎలా సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నించారు, నిలదీశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి. డ్రైవర్ పై చర్యలు ఎలా తీసుకున్నారంటూ ఆ ఇద్దరు నేతలు కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌ను కలిశారు.
జగిత్యాల్ ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తాను గానీ, డిపో మేనేజర్ గానీ సస్పెండ్ చేయలేదని రీజినల్ మేనేజర్ స్పష్టం చేశారు. తొలగింపు లేఖను చూపించిన తర్వాత, రీజినల్ మేనేజర్ తన వాంగ్మూలాన్ని మార్చుకుని, తన వద్ద ఎటువంటి సమాచారం లేదని, బహుశా డిపో మేనేజర్ చేసి ఉండవచ్చని అన్నారు. రీజినల్ మేనేజర్‌కు తెలియకుండా డిపో మేనేజర్ ఎలా సస్పెండ్ చేయగలిగారో తెలపాలని గంగుల కమలాకర్ నిలదీశారు . డిపో మేనేజర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అశోక్ సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి , ఇతర బీఆర్ఎస్ నాయకులు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
ఇదిలా ఉండగా డ్రైవర్ అశోక్ పై చర్యలు తీసుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
