హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత దేశ మాజీ ప్రధానమంత్రి, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ పై. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పోషించిన పాత్రను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు; ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సాకారమైందని పేర్కొన్నారు. శనివారం నాడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. ఆధునిక భారతదేశ రూపశిల్పిగా కొనియాడారు. ఈ సందర్భంగా, హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలు ఇచ్చిన అరుదైన నివాళి అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధికి, 1991లో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
భారతదేశపు వినమ్రమైన, దూరదృష్టి గల ముద్దుబిడ్డకు కృతజ్ఞతతో కూడిన రాష్ట్రం ఘన నివాళి అర్పిస్తోంది అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. తను పీఎంగా ఉన్న సమయంలోనే మన రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిందన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత దేశ ఆర్థిక సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా చివరగా భారతదేశ ప్రధానమంత్రిగా ఇలా వివిధ హోదాల్లో సేవలందించిన ఆధునిక భారతదేశ రూపశిల్పి అని ప్రశంసించారు. ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తగా, నిజాయితీ గల రాజనీతిజ్ఞుడిగా , అంకితభావం కలిగిన ప్రజాసేవకుడిగా డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు; ఆయన దూరదృష్టి, నాయకత్వం భారతదేశ అభివృద్ధికి చిరస్మరణీయమైన కృషిని అందించాయని ప్రశంసించారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారతదేశ ఆర్థిక ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచిన చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారు. ప్రధానమంత్రిగా ఆయన ఆర్థిక వృద్ధి, జాతీయ అభివృద్ధి, ప్రజా సంక్షేమం , సమ్మిళిత ప్రగతి పట్ల నిబద్ధతతో పనిచేశారని పేర్కొన్నారు. ఆయన వినయం, వివేకం , ప్రజాసేవ పట్ల అచంచలమైన అంకితభావం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు.
