ముంబై : రోజు రోజుకు భారతీయ రూపాయి బలహీన పడుతోంది. తాజాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు తగ్గి 95.55కి చేరింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు సరఫరాలో అంతరాయాల కారణంగా రూపాయిపై ఒత్తిడి పెరిగి, ప్రారంభ ట్రేడింగ్‌లో ఈ పతనం నమోదైంది. అయితే డాలర్ విలువ స్వల్పంగా తగ్గడం , అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోవడం వంటి అంశాలు రూపాయి మరింత భారీగా పడిపోకుండా అడ్డుకున్నాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 95.54 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత 10 పైసలు తగ్గి 95.55 స్థాయికి చేరింది. ప్రారంభంలో నమోదైన లాభాలను కోల్పోయిన రూపాయి, చివరకు 1 పైసా తగ్గి 95.45 వద్ద స్థిరపడింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్ట స్థాయిని 95.60 వద్ద కాపాడుతుండగా కనిష్ట స్థాయి 95.40 వద్ద వద్ద చమురు దిగుమతిదారులు , నెల చివరి డిమాండ్ కారణంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీనివల్ల రూపాయి 95.40 నుండి 95.60 పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది అని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ట్రెజరీ హెడ్ అనిల్ కుమార్ భన్సాలీ పేర్కొన్నారు. జాక్సన్ హోల్ సింపోజియంలో యూఎస్ ఫెడ్ చైర్ కెవిన్ వార్ష్ ప్రసంగాన్ని మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ బలాన్ని సూచించే ‘డాలర్ ఇండెక్స్’ 0.01 శాతం తగ్గి 99.14 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ చమురు ధరలకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 0.48 శాతం తగ్గి బ్యారెల్‌కు 89.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్ విషయానికి వస్తే ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 245.56 పాయింట్లు పెరిగి 77,191.80 వద్దకు చేరగా, నిఫ్టీ 54.20 పాయింట్లు పెరిగి 24,147.50 వద్దకు చేరింది.



















